మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి
శ్రీ శ్రీ సాధారణ నామ సంవత్సరం చైత్ర శుద్ధ షష్టి ఆరుద్ర నక్షత్రంలో జన్మిచారు. 30-4-1910 అని విశాఖపట్నం మున్సిపాలిటీ రికార్డులలో ఉన్నదని విప్లవ రచయితల సంఘం నిర్ధారించింది
ఇరవయ్యో శతాబ్దాన్ని సాహిత్య పరంగా శాసించిన మహా కవిశ్రీ శ్రీ . శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ గా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించినకవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణఇలా రాసాడు: "కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది" మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.
శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు) శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు.1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
1935 లో విశాఖ లోని మిసెస్ ఎ వి ఎస్ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలోసమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
రచనలు
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు
శ్రీశ్రీ రచనల జాబితా
- ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
- వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
- సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
- మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
- మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
- మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
- అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
- మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
- మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
- రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
- త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
- చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
- మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
- సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
- గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
- మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
- 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
- ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
- వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మచిలీపట్నం - 1969
- శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
- Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
- లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
- రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
- వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
- మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
- చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
- మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
- సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
- పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
- శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
- New Frontiers - ప్రచురణ: విరసం - 1986
- అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986
శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.
- ప్రజ (ప్రశ్నలు జవాబులు) - ప్రచురణ: విరసం - 1990
- తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
- విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
- ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
- ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
0 కామెంట్లు